ఆ డ్రైవర్ రిటైర్ అవుతుంటే అందరిలోనూ భావోద్వేగాలే!

  • కేఎస్ఆర్టీసీలో 34 ఏళ్ల పాటు డ్రైవర్‌గా మచ్చలేని సేవ
  • సర్వీసులో ఒక్క ప్రమాదం కూడా చేయని డ్రైవర్ జోసెఫ్ మచాడో
  • 22 ఏళ్ల పాటు వోల్వో బస్సులను నడిపిన అరుదైన ఘనత
  • చివరి ట్రిప్పులో ప్రయాణికులు, సిబ్బంది ఘన సత్కారం
  • గుండె ఆపరేషన్ సమయంలో ఆదుకున్న సంస్థకు కృతజ్ఞతలు
ప్రభుత్వ ఉద్యోగమంటే నిర్లక్ష్యం అనే అపవాదును చెరిపేస్తూ, 34 ఏళ్ల పాటు సంస్థకు నిష్కళంకమైన సేవ అందించి ఆదర్శంగా నిలిచారు ఓ బస్ డ్రైవర్. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC)లో డ్రైవర్‌గా పనిచేసిన జోసెఫ్ మచాడో, తన సుదీర్ఘ సర్వీసులో ఒక్కటంటే ఒక్క ప్రమాదం కూడా చేయకుండా, మే 30న గౌరవంగా పదవీ విరమణ చేశారు.

కర్ణాటకలోని ఉడిపి జిల్లా ఉద్యావర ప్రాంతానికి చెందిన జోసెఫ్ మచాడో, 1992లో కుందాపుర డిపోలో డ్రైవర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన సర్వీసులో 22 సంవత్సరాలు కేవలం కేఎస్ఆర్టీసీ ప్రతిష్టాత్మక వోల్వో బస్సులనే (ఐరావత్, అంబారి ఉత్సవ్) నడిపారు. 2002లో బెంగళూరులో వోల్వో సేవలు ప్రారంభించినప్పుడు ఎంపికైన తొలితరం డ్రైవర్లలో మచాడో ఒకరు. మంగళూరు-చెన్నై, మంగళూరు-ముంబై, మంగళూరు-పుణె వంటి సుదూర మార్గాల్లో ఆయన పనిచేశారు.

సమయపాలన, ప్రయాణికుల పట్ల మర్యాద, సురక్షితమైన డ్రైవింగ్‌తో ఆయన అందరి మన్ననలు పొందారు. మే 29న ముంబై నుంచి మంగళూరుకు నడిపిన ఐరావత్ బస్సే ఆయన చివరి ట్రిప్. ఈ సందర్భంగా ప్రయాణికులు, సహోద్యోగులు ఆయన్ను శాలువాతో సత్కరించి, భావోద్వేగ వీడ్కోలు పలికారు.

2018లో తనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినప్పుడు, సంస్థ 6 నెలల వేతనంతో కూడిన సెలవు ఇచ్చి అండగా నిలిచిందని మచాడో కృతజ్ఞతలు తెలిపారు. తన ఉన్నతాధికారులకు, సహోద్యోగులకు ధన్యవాదాలు చెప్పారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎలా ఉండాలో చాటిచెప్పిన మచాడో సేవానిరతి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయనతో ప్రయాణించిన పలువురు తమ అనుభవాలను పంచుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Joseph Machado
KSRTC
Karnataka State Road Transport Corporation
Bus Driver Retirement
Volvo Bus Driver
Udupi
Kundapura
Road Safety
Employee Farewell
Karnataka Transport

More Telugu News